Posts

Showing posts from 2016

అమ్మ నడచిన దారి.....

అమ్మ నడచిన దారి.....                     ఈ రోజు మాతృ దినోత్సవం. మనసు కాలాలు దాటుకుని వెళ్లి అమ్మను చూస్తోంది. బాల్యంలోకలా... స్మృతి పథంలోకి అడుగులేసుకుంటూ నడచి పోతోంది. .. “ఒరేయ్..చిన్నోడా..! మీ అమ్మ ఇందాక మొగసాల్లోనే కూసోని నీ కోసం చూసి-చూసి పనికి పోయిందిరా..” రాములత్త మాటల్నలా నేను గ్రద్ధ కోడిపిల్లను అమాంతం గాల్లోకి తన్నుకు పోయినట్లు నా చెవుల్లో వేసుకుని రయ్ మని పరుగు తీస్తూ ఇంటి గడప దగ్గరాగాను. పిల్ల చేష్టలు. నేను నిలకడగా నిలచిందెక్కడా.. రెక్కలు కట్టుకోని అలా పరుగులెట్టడమే గదా. అమ్మ ఇంటికి తాళం వేయలేదు. ఊరికే గడికి తాళం తగిలించి పోయింది. హమ్మయ్యా.. ! గడి తీసి తలుపు తోసుకుంటూ లోపలికెళ్లాను. బాగా ఆకలిగా ఉంది. పొయ్యికి కొంచెం ఎత్తులో ఉట్టి ఉంది. ఉట్టి మీద దబరుంది. ఆ ఉట్టి ఎప్పటిదో..! నాకు తెలియదు. సచ్చు తంతితో దాన్నల్లారు. అది మా తాతల కాలం నుండి ఉందని మా అమ్మ అంటూ ఉంటుంది. పొయ్యి పైకెక్కి దబరందుకుని చూస్తే అందులో రాగి సంగటి ముద్దుంది. అందులోకి కాల్చిన మిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, చింతపండుతో చేసిన కారముంది. సంగట్లోకి ఆ కారమంటే నాకు భలే ఇష్టం. ముద్ద పెట్టుక