అమ్మ నడచిన దారి.....



అమ్మ నడచిన దారి.....

                   రోజు మాతృ దినోత్సవం. మనసు కాలాలు దాటుకుని వెళ్లి అమ్మను చూస్తోంది. బాల్యంలోకలా... స్మృతి పథంలోకి అడుగులేసుకుంటూ నడచి పోతోంది... “ఒరేయ్..చిన్నోడా..! మీ అమ్మ ఇందాక మొగసాల్లోనే కూసోని నీ కోసం చూసి-చూసి పనికి పోయిందిరా..” రాములత్త మాటల్నలా నేను గ్రద్ధ కోడిపిల్లను అమాంతం గాల్లోకి తన్నుకు పోయినట్లు నా చెవుల్లో వేసుకుని రయ్ మని పరుగు తీస్తూ ఇంటి గడప దగ్గరాగాను. పిల్ల చేష్టలు. నేను నిలకడగా నిలచిందెక్కడా.. రెక్కలు కట్టుకోని అలా పరుగులెట్టడమే గదా. అమ్మ ఇంటికి తాళం వేయలేదు. ఊరికే గడికి తాళం తగిలించి పోయింది. హమ్మయ్యా..! గడి తీసి తలుపు తోసుకుంటూ లోపలికెళ్లాను. బాగా ఆకలిగా ఉంది. పొయ్యికి కొంచెం ఎత్తులో ఉట్టి ఉంది. ఉట్టి మీద దబరుంది. ఆ ఉట్టి ఎప్పటిదో..! నాకు తెలియదు. సచ్చు తంతితో దాన్నల్లారు. అది మా తాతల కాలం నుండి ఉందని మా అమ్మ అంటూ ఉంటుంది. పొయ్యి పైకెక్కి దబరందుకుని చూస్తే అందులో రాగి సంగటి ముద్దుంది. అందులోకి కాల్చిన మిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, చింతపండుతో చేసిన కారముంది. సంగట్లోకి ఆ కారమంటే నాకు భలే ఇష్టం. ముద్ద పెట్టుకోని అలా తినబోతే  టైగరొచ్చి ఎదురుగ్గా నిలబడింది. నుదుటిన తెల్ల చుక్క బొట్టు పెట్టినట్టు, తోక చివర తెల్లగా ఒళ్లంతా చారలు చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. అందుకే నేను దానిని టైగరని పిలుస్తా ఉంటా. దానికిప్పుడు ఐదు పిల్లలు. ఆ పిల్లలిప్పుడు  కొంచెం పెద్దవైనా..అమ్మ పాలు త్రాగుతానే ఉంటాయి. టైగర్ నా ముందిప్పుడు ఒగిరిస్తా నిలబడింది. దాని నోట జొల్లు కారుతూ ఉంది.  నేను ఇంట్లో ఉంటే అది నన్ను విడచిపెట్టి పోదు. తోలినా గూడా అటు-ఇటు తిరిగి మరళా నా కాడికే వచ్చి నిలబడుతుంది. నేను దానిని చూసినప్పుడల్లా తోకాడిస్తుంది. జాలిగా నాకేసి చూస్తుంది. ఆ జాలి చూస్తా ఉంటే నాకు దానికి ఏ జన్మలోనో బంధము ఉండిందేమో అనిపిస్తుంది. దాని పిల్లలను తెచ్చి ఎన్నిసార్లు ఆడుకున్నానో..అది నన్నేమి అరవదూ..కరవదూ. ఇంకొకటుంది గండు కుక్క. దానిని చూస్తే నాకు ఎక్కడ లేని మంట. అది మొరుగుతానే ఉంటాది. దారిన పోయే వాళ్లందరి మీదకి ఎగబడతా ఉంటుంది. నాకు కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఒకసారి నేను దాని పిల్లలను ఎత్తుకొస్తా ఉంటే వెంటబడి పిర్రల మీద కరచింది. అమ్మ పిప్పింటాకు సున్నమేసి దంచి కడితే రెండు-మూడు రోజులకే మాడిపొయ్యింది.
     టైగర్ నా వైపే ఆత్రుతగా చూస్తా ఉంది. “నీకు ఆకలిగా ఉందా..?” అంటే కుయ్ ..కుయ్ మని మూలిగింది. “నీ ఆకలి చూడ్డానికి నువ్వు ఎవరింటి కుక్కవు కాదుగా..వీథి కుక్కవు. నీ పొట్ట చూడో ఎక్కడో ఉంది. అసలు నీకు పొట్ట లేదేమో అనిపిస్తుంది. బర్రెలు ఎక్కిరిస్తా ఉండాయి. నిన్ను చూసుకోవడానికి మీ అమ్మా-నాన్నా లేరుగా..సరేలే.. నీకు రెండు పిడచలు, నాకు రెండు పిడచలు..”  అలాగ కుక్కతో మాట్లాడుకుంటూ నా సంగటి తినడం అయిపోయింది.
      ఏడో తరగతి పబ్లిక్ రాశాను. మూడు..నాలుగు..ఐదు..ఆరు..అన్ని క్లాసుల్లో నేనే ఫస్టు. ఏడు కూడా నాదెందుకు కాదు. నాదే. నా దృష్టి ఏడు మీద కాదు ఎనిమిది మీద. చదువు దగ్గర నేను మొండోడ్ని. నాకు సెలవుల్లో చదువుకోవడానికి పుస్తకాలు కావాలని మారాం చేస్తే  అమ్మ చేలల్లో కూలి పనికొస్తానని చెప్పి సిద్ధయ్యోళ్ల అబ్బాయి శంకరయ్య పుస్తకాలు తెచ్చింది. శంకరయ్య మా స్కూలే. ఇప్పుడు తను తొమ్మిదికి పోతాడు.  కొన్నింటికి అట్టలు చిరిగి పోయున్నాయి. కొన్ని బాగున్నాయి. ఆ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎనభై రూపాయలంట. తెలుగు, సోషలు, సైన్సు లో కొన్ని పాఠాలు చదువుకున్నా, మాదిరి లెక్కలు చూసి కొంత లెక్కల సాధన చేసినా ఇంగ్లీషు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పాఠం ఒక పట్టాన అర్థం కాలేదు. పుస్తకాలు తిరగేసుకుంటూ అట్టే నిద్దురపోయాను.
              ఏదో గోల-గోలగా ఉంటే మెలకువొచ్చింది. అమ్మ ముందుగా వస్తోంది. తన వెలకాలే సరసక్క గగ్గోలు పెడుతూ అరుస్తా ఉంది. ఆమె నోరొక పెద్ద మైకు. ఏ చిన్నమాటైనా ఫర్లాంగు దూరం వినబడాల్సిందే. ఆ చోద్యం చూసేందుకు పిల్లకాయలంతా గుంపుగా ఆ వెనుకనే వస్తున్నారు. అందరూ మా ఇంట్లోకే వస్తున్నారు. మీ వాడేనంట కోసింది. మిగిలిన పిల్లోల్లంతా చెబుతా ఉంటే..సరసక్క నల్లంగా ముఖం బెట్టుకోని గట్టిగా అంటోంది. అమ్మ నేల జూస్తా గడపట్లోకి వచ్చేసింది. గడపట్లో నిలబడి ఉండే నన్ను అమ్మ అలాగే తీక్షణంగా చూసింది. నా అంతరంగాన్ని అమ్మ వెతికినట్లుగా ఉంది. నా మనసును తను స్కానింగ్ చేసిందేమో అనిపించింది.  “చెప్పరా .. నువ్వే గదా.. పైపు కోసింది.” సరసక్క నాకేసి  గుడ్లురిమి చూస్తా నిలదీస్తా ఉంది. నాకేమి అర్థం కాలేదు. నేను చేసిన తప్పేంటాయని నేను వెతుక్కుంటున్నా. మధ్యాహ్నం వీళ్ల చేలోనే నీళ్లు తాగాను. సరే..! నేనేమి కోయలేదే. ఆలోచిస్తా ఉంటే....!  “ఆ చూపు చూడు ఏమి తెలియని నంగనాచిలా..బ్లేడుతో పైపులు కోసే పనేందిరా.? అసలు మా చేలల్లో మీ కేం పనిరా?అంటూ తిట్టిపోస్తా ఉంది తను. అమ్మ వైపు చూస్తే నీరసంగా అరుగు మీద కూర్చోని భారంగా శ్వాస తీసుకుంటోంది. అమ్మ ముఖం, కాళ్లు చేతులు ముడతలు పడి సరసక్క వాళ్లవ్వలా కనబడతోంది. ఈ మధ్యనే అమ్మ అంటుండేది. నాకు నలభై ఎనిమిదేళ్లొచ్చాయని. సరసక్క వాళ్లవ్వకు ఎనభై ఏళ్లు. అరికాళ్లు అరి చేతులు పగుళ్లొచ్చి కరువు-కాటకాలతో నీటిచుక్క లేక నెర్రెలు చీలిన బీడు భూమిని తలపిస్తున్నాయి. అమ్మ కష్టపడడానికే పుట్టిందా అన్నట్టుంటుంది. తను శ్రమకి చక్కని పరిభాష. కష్టపడనోడికి అన్నం తినే అర్హత లేదంటుంది. తను మాటల మనిషి కాదు,చేతల మనిషి. నా కనిపిస్తుంది తను మనసులతో మాట్లాడగలదని. సరసక్క కేకలు చల్లబడ్డాయి. కొంచెం సేపలా మౌనాన్ని వహించిన ఆ క్షణాలు. తనకేమి చెప్పాయో.. అమ్మ తనకేమి చెప్పిందో తెలియలా. తను వెనుదిరిగి వెళ్లిపోయింది. ప్రశాంతత వహించిన క్షణాలు కోపోన్ని చంపగలవు. ఆవేశాలని అణచగలవు. వాస్తవాలను ఎరుకపరచగలవు. నిలకడుంటే నిజాలు బోధపడతాయి. అమ్మ చెప్పే మాటలే. చెవులతో వినేవి, కళ్లతో చూసేవన్నీ నిజాలు కావు. కొన్ని మనసుతో చూడాలని చెబుతుంది. మా ఇంట్లో జాతరేమోనని ఎగేసుని వచ్చిన పిల్లలంతా వానొచ్చి వాళ్ల మీద పడ్డట్టు  మెల్లగా ఒక్కొక్కరలా వెళ్లిపోయారు.
          మా నాన్న ఉండుంటే వారి కనులకు జాతరే. ఈ పాటికి నన్ను నాలుగు తన్నుండేవాడు. ఒకసారి ఇలాగే జరిగింది. బ్రాహ్మణోళ్ల అమ్మాయమ్మ దొడ్లో వడ్ల గింజలారబోసి నన్ను కాపలా బెట్టాడు మా నాన్న. చుట్టు ప్రక్కల కోళ్లన్నింటికీ ఆ గింజల మీదే కన్ను. ఇరవై రోజుల కూలి గింజలవి. ఆ కోళ్లు నన్ను ఈ వల్లకావల్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. అప్పుడింకా చిన్నోడ్ని. బొకబొకమని ఒక కోడి వడ్ల గింజలన్నీ బొండిగనిండా పోసేసుకుంటా ఉంది. నాకు కోపం వచ్చేసింది. ఒక రాయి తీసి గురి చూసి కొట్టా. అంతే.. రాయి సరిగ్గా బొండిక్కే తగిలింది. బొండిగ పగిలి గింజలు ఆరబోసిన గింజల్లోనే రాలిపోయాయి. కోడి ఎగిరట్టపడింది. చాలా సేపు గిలగిల కొట్టుకోని చచ్చిపోయింది. ఆ కోడి సరసక్కదే. ఆ రోజు సాయంత్రం నలుగురిని పిలుచుకోని వచ్చి పంచాయితి పెట్టింది. పిల్లకాయలంతా గుంపైనారు. మా నాన్నకు కోపమెక్కువ. ఆయన ఒక మాటంటే పడడు. పౌరుషం ఆయన నరనరాల్లో ఇముడుకోనుంది. కోడి లెక్క కట్టిస్తానని నాన్న ఒప్పుకొన్నాడు. ఇప్పుడు నాన్న కోపం నా మీద పడింది. నేను అటు-ఇటు పరుగెడతానని గుంజకు కట్టేసి చెర్నాకోలతో నాలుగు దెబ్బలు పీకినాడు. అమ్మ ప్రాణం విలవిలలాడిపోయింది. అమాంతం అడ్డుపడింది. తనకు రెండు దెబ్బలు తగిలాయి. రాత్రయింది. అయినా ఆకలెయ్యలేదు. గుంజకు కట్టిన నన్ను విప్పలా. ఆ రాత్రికి గుంజకట్లే ఉండిపోయానాను. గుంజకట్లే నిలబడి తూగుతున్నాను. తెల్లవారు ఝామునెపుడో కట్టిన ముళ్లు వదులయ్యాయి. అమ్మే నాన్నకు తెలియకుండా ముడులు వదులు చేసి ఉంటుంది. తాడు విప్పుకోని మెల్లగా వీథిలోకి పారిపోయాను. వీథిలోకి చూస్తే అమ్మో చింత చెట్టు. దాని మీద దెయ్యముందని అందరూ అంటారు. భయం-భయంగా  చింతచెట్టు క్రిందకి చేరాను. వెనక్కి తిరిగి చూస్తే నాన్న వచ్చినట్లుంది. చెట్టి క్రింద బండి దొల్లలో ముడుక్కున్నాను. పైకి చూస్తే దెయ్యం కనబడలేదు. అమ్మయ్యా..అనుకుంటూ నిద్దుర పోయాను. తెల్లారినాక అమ్మ చాటుగా సద్దన్నం, పలకా-పుస్తకాలు చెట్టుక్రిందకు తీసుకొచ్చింది. అమ్మకు తెలుసు నాకు చదువంటే ఎంతిష్టమో.. సద్దన్నం తిని బడికిపోయాను.
              మా అమ్మ నన్నెప్పుడూ చెంపకుబట్టైనా చిటుక్కుమని ఒక దెబ్బా కొట్టలేదు. నాన్నకు మాత్రం నేనంటే చాలా కోపం. నన్ను ఎత్తుకుని ముద్దాడింది నాకసలు తెలియదు. నేను పుట్టినప్పటి నుండి తనకు ఆరోగ్యం బాగలేదంట. ఎవరో సగినం చెప్పినారంట నేను పుట్టడం వల్లే తనకు బాగలేకుండా పోయిందని. అమ్మకూ బాగలేదు. ఆయాసం. కానీ అమ్మెప్పుడూ నన్ను అసహ్యించుకోలేదు. నీవు పుట్టడం వల్లే నాకు బాగ లేకుండా పోయిందని అమ్మనలేదు. అమ్మకు నేను ముద్దుల కొడుకునే. కానీ అమ్మ ఒడిలో నేనంతగా ఓలలాడలేదు. నాకు ఊహ తెలిసినప్పటినుండి నా మంచం-కంచం, స్నానం చేసే సోపు అన్నీ ప్రత్యేకమే. ఎందుకమ్మా నాకిలా వేరుగా పెడుతున్నావంటే..నీవు మా బిడ్డవు కావు. దొరికితే తెచ్చుకున్నామంది. అమ్మ తమాషాగా అన్నా నేను ఎక్కిళ్లు పెట్టి-ఎక్కిళ్లు పెట్టి ఎడ్చేశాను. అప్పుడు అమ్మ కళ్లల్లో నీళ్లొచ్చాయే గానీ, నన్ను దగ్గరకు లాక్కోలేదు. ముద్దైనా పెట్టలేదు.
                        నేను చెయ్యని నేరాన్ని నామీదేసిన మనుష్యులను చూస్తే నాకు అసహ్యంగా అనిపిస్తోంది. వీథిలోకి పోను బుద్ధి పుట్టలేదు. వెనక్కి తిరిగి ఇంట్లోకెళ్లి మళ్లీ పుస్తకాల్లో మునిగిపోయాను. అరుగు మీద నుండి లేచిన అమ్మ ఇంటి పనిలో మునిగిపోయింది. సేదబావి దగ్గర నుండి నీళ్లు తోడుకోనొచ్చి తొట్లకు పోస్తోంది. నేనలా చదువులోనే లీనమై పోయాను. అమ్మ వంట చేసి స్నానానికి నీళ్లు కాచి పెరుగు తేను పెద్దాలామింటికి బోయింది. అమ్మ ఎంత సేపటికీ రాలేదు. తను ఎప్పుడింతే .. మాటల్లోబడితే ఒక పట్టాన రాదు. కాదు ..అమ్మ మాట విన్నవారెవరూ ఒక పట్టాన రానివ్వరు. అమ్మకు అక్షరం ముక్క రాకపోయినా తన మాటల్లో చల్లని దైవముంది. తనకు తెలిసింది నలుగురికి పంచాలంటుంది. గిరిగీసుకున్న బ్రతుకు తనది కాదు. ఊరికే తనేది తీసుకోదు. రెక్కల కష్టమే తనది. వేడి నీళ్లతో నేను స్నానం చేసి  పొయ్యి మీద దబరకు  నీళ్లు ఎగబోశాను. నీళ్లు కాగుతుండంగానే అమ్మ వచ్చేసింది. అన్నం తిన్నాక రోజులాగే అమ్మ రెండు మంచాలేసింది. “అమ్మా..అమ్మా..”అని గోముగా నేనంటే.. “ ఏం నాయనా.. “ అంది అమ్మ.  “ఈ రోజన్నా నీ కాడ పడుకుంటానమ్మా..నన్నెందుకు నీ దగ్గర పడుకోబెట్టుకోవు..” అంటే నీవు పెద్దోడివవుతున్నావు కదా..’’ అంది. చిన్నప్పటినుండి నాన్న దగ్గర అమ్మ ఒళ్లో పడుకొన్నది నాకసలు ఊహలో లేదు. నన్నెప్పుడు వారు దూరంగానే పెట్టారు. నేను అందరికంటే చిన్నోడ్ని. నేను పుట్టక ముందే అక్కకు పెళ్లైంది. అక్కకు బిడ్డ పుట్టిన ఆరు నెలలకు నేను పుట్టానంట. నేను పుట్టినప్పటి నుండి అమ్మా-నాన్న ఇద్దరికీ ఆరోగ్యం సరి లేకుండా పోయాందట. అన్నకు పెళ్లైనపుడు నేను చాలా చిన్న పిళ్లోడ్ని. మరో ముగ్గురు నేను భూమి మీదకు రాకముందే కన్నుమూశారంట. సంవత్సరం క్రితమే ఇంకో అన్న మట్టిని కప్పేసుకున్నాడు. మంచాన పడున్న యతి-మతి సరి లేని ఆ అన్న ఉండుంటే ఒంటికి-దొడ్డికి ఎత్తిపోయలేక అమ్మ ఇంకా ఎంత యాతన పడేదో. “కొంచెం సేపైనా నీ ఒళ్లో పడుకుంటానమ్మా..” అని బాధగా నేనంటే అమ్మ జాలిగా నా వైపు చూసింది. వెళ్లి అమ్మ ఒళ్లో తలపెట్టి పడుకుంటే ఈ ప్రపంచాన్ని నేను జయించానన్నంత సంతృప్తి. అమ్మ నా తలనలా నిమురుతోంది. అప్పుడు నాకు ఈ జీవితం నాకు చాల్లే అనిపించేది. “ సరసమ్మ తోటలోకి ఎందుకు పోయావు నాన్న..” నా వైపు చూస్తూ అమ్మ అంది. “నేను వాళ్ల పైపు కోయలేదమ్మా..ఎవరు కోసారో కూడా తెలియదు. ఈతకెళ్లి వస్తుంటే దప్పికేసింది. వాళ్ల తోటలో కెళ్లి చూస్తే నీళ్లు కారుతున్నాయి. నీళ్లు త్రాగొచ్చానంతే.” అన్నాను. “బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకాయంట. మనలాంటి జీవితాలు చాలా తెలివిగా ఉండాలి. ఈ గుక్కెడు పానం బోతే నీ వేమవుతామోనన్న దిగులేరా నాది. నీవు నా పొట్టలో రెండు నెలల పిండానివిగా మాఘమాస స్నానాలు చేసినోడివి. పాహిమాంచి క్రిష్ణాయంటే పలుకవేమిరా..అని వీథిలో మంచి భజన పాటలు పాడే సమయాన నువ్వు పుట్టినోడివి. నీ బతుక్కి ఒకర్థముందిరా...” అమ్మలా చెబుతుంటే నాకేమర్థం కాలేదు. “ఒక పాట పాడమ్మా...” అన్నాను. “అమ్మ సరే నీ మంచంలోకి పో అంది.” సరేనంటూ నా మంచంలోకెళ్లి పోయాను. మా అమ్మ ఎప్పుడూ కథలు చెప్పేది. పాటలు పాడేది. బ్రహ్మం గారి తత్త్వాలు అమ్మకు బాగా వచ్చు. అమ్మ పాడుతూ-పాడుతూ అప్పుడప్పుడు ఆగేది. ఎగశ్వాస-దిగశ్వాస పెట్టేది. అమ్మకు ఆయాసముంది కదా. “కాకి ఒకటి కంపాదెచ్చి ..పెట్టిందీ ఒక్కా గూడూ.. గూటిలోని పిల్లలు రెక్కలొచ్చి.. ఎగిరిపోయే సమయాన..గూటితో ఒక్కా..మాటా.. చెప్పి పోయినాయా..” అమ్మలా పాడుతోంది. నేను హాయిగా నిద్దురపోయాను. సమయం నడిరేయి దాటింది. నిశ్సబ్ధ సమయాన నేను నీళ్లకు లేస్తే ఎక్కడో పిల్లి కూతలొస్తున్నాయి. మేమున్న ఆ చుట్టింట్లో మాకే చోటు తక్కువ. పిల్లెక్కడబ్బా..నాకర్థం కాలేదు. అమ్మ మంచం దగ్గరనుంచే. ఆ పిల్లి కూతలు అమ్మవే. అన్నం తిన్న తరువాత అమ్మ రోజూ వేసుకునే ఆయాసం మాత్రలు వేసుకోలేదు. గూట్లో మాత్రల డొప్పాలన్నీ ఖాళీగా ఉన్నాయి. గాలి తీసుకోవడానికి అమ్మ ఇబ్బంది పడుతోంది. అమ్మను తట్టి లేపాను. పొద్దస్తమానం పని చేసినొళ్లు. అలసిపోయింది. ఎక్కడో ఉన్న ప్రాణం అమ్మలో చేరింది. ఆయాసపడుతూ అమ్మ లేచింది. “ఏం నాయనా..! నిద్దుర రాలా..?” అంది. “అమ్మా నీ నుండి పిల్లికూతలొస్తున్నాయమ్మా..!!” అంటే “వాటికి ఈ ప్రాణం కావాలంట. నేనెలా ఇచ్చేది. ఈ ప్రాణం నీదిరా.. ” అంది. నేను ఆలోచిస్తుంటే.. “అవంతేలే నన్నేమి చేస్తాయిరా ఆ పిల్లికూతలు. వెళ్లి నిద్దుర పో నాయనా ..” అంది. నేను అప్పుడు చిన్నోడ్నే. అయినా ఊహ తేలిసినోడ్ని. పడుకుంటే నిద్దుర రాలా..కన్నీళ్లు నా చెంపలపై జారుతూనే ఉన్నాయి.
                     ఇప్పుడు నలుగురు గౌరవించేలా నిలబడినా అది అమ్మ చూపిన దారే. తను నడచిన దారి నా కళ్ల ముందే ఉంది. ఈ కన్నీటి చుక్కల్లో అమ్మ పాదాలు కనబడుతూనే ఉన్నాయి. నేను అమ్మ జ్ఞాపకాల్లో పిల్లోడ్నే. నేటికి ఏ నాటికీ అమ్మ కోసం తపన పడే పసి బిడ్డనే.
P.RAVINDRA NAD ,
 9491640331. 
PUBLISHED IN ONLINE ARUGU MAGZINE ON 15-5-2016.
                            **************************

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

పుడమి తల్లి దాహం తీరింది