ఏం చెప్పుకోను నాగురించి నేను

ఏం చెప్పుకోను

నాగురించి నేను


ఏం చెప్పుకోను
నాగురించి నేను
నిప్పు కణికలు నయనాల్లో రాలుతుంటే
నిరాశ నిశీథిలో నింగికేసి చూస్తే
ఆకాశంలో ఉరిమే మబ్బులు
నాలో భయోత్పాతాన్ని సృష్టించాయి.
కంటిమీద కునుకు లేని
ముళ్లపానుపుపై నిద్దుర కలత కలిగిస్తే
చింపిరి తెంపిరి అంగ వస్త్రాలతో
సిగ్గును చంపేసి
మాయా బజారులో అడుగేస్తుంటే
జాలి కళ్లు నా వైపే తొంగి చూస్తే
నా గుండె శబ్ధం నాకు వినబడింది.
దారిద్ర్య దు :ఖ దహనానికి
నడుము కట్టి నడుస్తుంటే
వడి వడి నా నడక శబ్ధం
రైలు బండి కూతైంది.
మోడువారిన జీవితాల్ని చూస్తూ
ముందడుగు వేస్తుంటే
నా నరాల్లో నవతేజం ఉరకలేసింది.
నాలోని మాలిన్య చింతల్ని
పుస్తకపుటద్దంలో చూస్తే
ఎంతో వికృతంగా కనపడ్డాయి.
నికార్సయిన నిజాల లోతుల్ని
అట్టడుగున చూస్తుంటే
మనిషి విభిన్న ఆకారాల్లో
ఉరుకులు -పరుగులు పెడుతుంటే
వికృతంగా అప్పుడు నవ్వుకొన్నాను.
నటించడం రాలేదు
అయిదో తెలివి లేనోడి బతుకెట్టాయని
అమ్మ కన్నీరు కారుస్తుంటే
విచారము నన్ను కప్పేసింది
నిజం చెప్పడమే తెలిసిన నన్ను
అమాయకుడని జనాలంటే
గతి తప్పిన మనసుతో
పిచ్చి జీవితం నాదైతే
నాలోకంలో నేను నిలబడి పోయాను
ఏం చెప్పుకొను
నాగురించి నేను.
                                                                                         రవీంద్రనాథ్.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?