మన ముఖ్య మంత్రి చంద్రబాబు గారు ఒక దళితుని ఇంట్లో భోంచేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రాజకీయములే అని తోసి వేయకండి.
అందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకుంటున్నారు.కులము ,మతము ఎలా పుట్టాయో శోధిస్తున్నారు.నిజానిజాల్ని తేటతెల్లం చేస్తున్నారు.నేనూ శోధిస్తున్నాను నిజాల్ని.
సాధారణమైన మనమేమి చేయగలమో...కదా.!
ఆలోచిద్దాం.మంచేదో మన మనసునడుగుదాం.
రాజకీయాలు,జీవన పోరాటాల్లో, సంపాదనా మార్గంలో మనమేమి కోల్పోయామో మన హృదయాలకి తెలుసు.
కుల మత విభేదాల్లేని సమాజం మనకు కావాలి.
వేల సంవత్సరాలుగా కుల ,మత,ఆచారాల వల్ల అణగారిపోయిన జీవితాలకి ఇకనైనా విముక్తి కలగాలి.
అందరం కలిసి జీవిద్దాం.మమతానురాగాలతో మన పల్లెను ఆనందమయం చేసుకుందాం.
పండగలు, శుభకార్యాలు ప్రేమాభిమానాలతో జరిగేవి కావాలి.డబ్బుతో ముడిపడి మన ఆనందాన్ని ఆహార్యం చేసేవి కాకూడదు.
నీతికి,నిజాయితీకి నిలబడదాం.
లక్షలు,కోట్లు కాదు.ప్రశాంత జీవనం గొప్పదని గ్రహిద్దాం.
మోసాలు,జూఠాతనం వల్ల ఎప్పుడూ గొప్ప జీవితం రాదు.
సమాజంలో దాని విలువ ఎప్పుడూ నీచమే.
మనలో అనాదిగా బావిలో కప్పలా మూఢ భావాలతో నిండి మనో వికాసము లేక అఙానంగానే మట్టిని చేరిపోతున్నాం.
కులాన్ని ,మతాన్ని ,వర్ణ,వర్గాలకు దూరంగా మానవత్వంతో ఆలోచిద్దాం.ఆనందమయ జీవితానికి అంకురార్పణ చేద్దాం.
కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడే ఆనందం వికాసమూ ఉంటాయి.
మన గ్రామానికి వెలుగు నింపడానికి జాయింట్ కలెక్టరు రామారావు గారు దత్తత తీసుకున్నారు.
మన జీవన వికాసానికి వారందించే సలహా సూచనల్ని పాటిద్దాం.
మనకు వారి ద్వారా అందించే వనరుల్ని సద్వినియోగం చేసుకుందాం.
మంచి జరగాలని,మంచి జరుగుతుందనే భావన పెంచుకుందాం.
పాజిటివ్ గా ఆలోచిద్దాం.జిల్లాలో ఎన్నో గ్రామాలున్నప్పటికి మన గ్రామాన్ని ఎంచుకున్న జాయింట్ కలెక్టర్ వారికి ఆనందాన్ని అందివ్వడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీలవుదాం.
శ్రమతోనే గెలుపని గ్రహిద్దాం.నేను ఎన్నో సార్లు కడుపు ఎండగట్టుకోని చదివాను.నా జీవితం మన గ్రామానికి తెరిచిన పుస్తకం.ఈ నాడు నాకు ఉద్యోగం ఉందంటే అది శ్రమ వల్లే సాధ్యమైంది.
శ్రమను నమ్ముదాం.
మానవత్వంగా ఆలోచిద్దాం.
తెలిసో తెలియక మనమందరం తప్పులు చేసి ఉంటాం. వాటిని క్షమించుకుని కలిసి బతుకుదాం.
ఊరికి దూరంగా పదేళ్ళుగా నేను ఉన్నా నా చుట్టూ ఉన్నా మీరందరూ నా మనసులో ఉన్నారు.
నాకు కళ్లు, నీళ్లు ఉన్నాయి.
హృదయంలో బాధ ఉంది.
కానీ కుల,వర్గాల మాలిన్యాన్ని చుట్టుకున్న మన గ్రామం స్వచ్ఛత కోసం తపన పడుతుంది.
కుల,మత,వర్గ,స్వార్థ, ఏహ్య భావాలు లేని నా జన్మభూమిని చూస్తాన్న ఆశ.
జై మాతృమూర్తి,జై జన్మభూమి.

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?