తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?



                                           తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?
మనుస్మృతి పదవ అధ్యాయం 12 వ శ్లోకం చూద్దాం.
"శూద్రాదాయోగవ:క్షత్తా చండాలశ్చధమోనృణామ్.
వైశ్యరాజన్యవిప్రాసు జాయంతే వర్ణసంకరా:"
శూద్రుని ద్వారా వైశ్య స్త్రీకి జన్మించిన సంతానం ఆయోగవమని, శూద్ర్రుని ద్వారా క్షత్రియ స్త్రీకి జన్మించిన సంతానం క్షత్తాయని,శూద్రుని ద్వారా బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానం చండాలురని చెప్పబడుదురు. వీరందరూ శూద్ర సంతానమైనందున వర్ణ సంకరమయ్యారు.వీరిని నీచులుగా చూశారు.
దౌర్భాగ్యమేమంటే వీరికి ఆస్తిపాస్తులు లేకుండా చేసిి నీచమైన కార్యములు అప్పజెప్పి అసహ్యంగా చూడడం వల్లనే నేటికి చండాలుల బిడ్డలు బిడ్డల జీవితం దుర్భరంగా,దయనీయంగా, వెలివేయబడి కనబడుతున్నది.
మనుధర్మ శాస్త్రాన్ని దాటి చూస్తే, రంగనాయకమ్మ వారి ప్రకారం ..మొదట ప్రతిభ ఆధారంగా పనులుండేవి.ధర్మ విచక్షణ,రాజ్యపాలన, వ్యాపారం,శ్రామిక జీవనానికి ప్రతిభే ప్రాతిపదిక.సప్త ఋషుల పర్యవేక్షణలో ఎంపికలుండేవి.
వివాహము వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉండేవి.ఒకే తండ్రి బిడ్డలు వివిధ రకాలైన పనులు చేసేవారు.వారి యోగ్యతలను బట్టి మార్పులు జరిగేవి.ఉచ్చము నీచమన్న భేదము లేక అందరూ కలిసి మెలిసి జీవించేవారు.కానీ పెరుగుతున్న జనాభా వల్ల సప్త ఋషులకు పని విభజన భారమైన తరుణంలో ఆయా తల్లిదండ్రులకే ఎంపిక బాధ్యతను అప్పగించడంతో స్వార్థాలు చోటు చేసుకున్నాయి. ధర్మబోధన గావించు తల్లిదండ్రులు స్వార్థంతో వారి బిడ్డల్ని అదే స్థాయిలో నిలపడానికి నియమాలు సృష్టించుకుని తమ ఉనికి నిలుపుకున్నారు.మిగతా పనుల వారైన రాజ్యపాలన,వ్యాపార రంగాల వారు అదేబాటను అనుసరించారు.వారి బిడ్డలు యోగ్యవంతులు కాకపోయిన అధర్మంగా నడిచారు.ప్రతిభ ఉన్నా తమ పిల్లల్ని ఉన్నతంగా నిలుపడానికి చేసిన పోరాటాల్లో శ్రామిక జీవనము కలిగిన తల్లిదండ్రులు వెనుకంజవేశారు.విఫలులయ్యారు.
శాస్త్రాలు, గ్రంథాలని కుటిల వర్ణాలు తమ స్వార్థాన్ని పూసుకుంటూ శూద్రజాతికి దాస్యాన్ని అంటగట్టి మానసిక కుంగుబాటుకు గురిచేశారు.
శూద్రులు ఎవరు?అంటరానివారు ఎలా ఏర్పడ్డారన్న బాబాసాహెబ్ అంబేద్కరుని నిరంతర శోధన ఫలితంగా ఎన్నో సత్యాలు వెలుగులోకి వచ్చాయి.మతమని, శాస్త్రమని పేరుపెట్టి అంధ విశ్వాసాలని కల్పించి శూద్రజాతులని బానిసలుగా మార్చేశారు .చాతుర్వర్ణ్య వ్యవస్థను రూపొందించి శూద్రజాతులకు దాసీబతుకును కల్పించి పాశవిక సమాజాన్ని రూపొందించారు.బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలుగా వర్ణాంతరమైన వారిని వివిధ కులాలుగా ,అంటరానివారుగా, నీచమైనవారుగా అక్షరబద్ధం చేసి ,మతమనే రక్షణ ముసుగేసి మానవతను,ప్రతిభను కాలరాస్తూ ఏర్పాటు చేసుకున్న కుటిల జనుల సమాజం మనది.కులాన్ని పటిష్టం చేయడానికి వివాహ వ్యవస్థను ఆయా వర్ణాల్లో,కులాల్లో బంధించి ,నియమాలను ఉల్లంఘించిన వారిని వెలేసి నీచంగా చూసిన సమాజం మనది.మతం ముసుగు తొలగించడనికి జైన ,బౌద్ధాలు సమాజానికి సవ్య దిశను చూపడానికి చేసిన ప్రయత్నం స్వార్థపరుల ముందు కొంతకాలం అజేయంగా నిలబడినా తరువాత సన్నగిల్లి పోయింది.విదేశీ ఆక్రమణల ఫలితంగా అరబ్బులు,బ్రిటీషువారి పరిపాలన సాగడం అనాది మత విశ్వాసాలకు గొడ్డలి పెట్టు కావడంతో శూద్రజాతులకు శ్వాస పీల్చుకోవడం జరిగింది.మతాంతరం కొందరికి బ్రతుకైంది.సంఘ సంస్కరణోద్యమాల ఫలితంగా కొంత సమాజిక జీవనానికి వెసులుబాటైంది.బాబా సాహెబ్ శూద్రజాతులకి ఆశాజ్యోతియై, మనోబలాన్ని కలిగించి నూతన శాసనాలని రూపొందించడం వల్ల మను ధర్మ ప్రాబల్యం తగ్గిపోయింది.కానీ మతం ముసుగు రక్షణలో, కులం గుప్పిట్లో స్వార్థమైన, కుటిలమైన శాసనాలు పాతుకొనున్నాయి.చదువు అందరికి అందుబాటులోనికి రావడం వల్ల వాస్తవాలను,సత్యాలను తెలుసుకోవడం మొదలుపెట్టాక ప్రజా జీవనంలో అసమానతలు తొలగడం మొదలయ్యాయి.
నీచమైన కార్యాలను విడనాడాలని అప్పుడే నీచత్వాన్నుండి బయటపడగలరని అబేద్కరులు స్వార్థపు కుండ బద్దలుకొట్టి చెప్పారు.మతం ముసగు నుండి బైటపడాలని ఉద్ఘాటించారు.స్వధర్మమైన బౌద్ధాన్ని చూపించారు.ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఆదర్శాన్ని నెలకొల్పారు.
లోకా సమస్తా సుఖినోభవంతు.
జై భీమ్.

Comments

Popular posts from this blog

दलित साहित्य क्या है ?

అమ్మ నడచిన దారి.....